blog single post
GENERAL NEWS

2019-03-14 02:52:30

ఫిక్కీ సహకారంతో రాష్ట్రానికి మరిన్ని సంస్థలు!

నవ్యాంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు అత్యంత అనువైన ప్రాంతంగా నిలుస్తుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ ఏపీ కౌన్సిల్‌ ఛైర్మన్‌ కాళి ప్రసాద్‌ అన్నారు. ఉత్పత్తి, విద్య, వైద్య, సేవారంగాల్లో పెట్టుబడులు సాధించడానికి ఫిక్కీ కృషి చేస్తుందన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో నిన్న జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పలు రాష్ట్రాలు పెట్టుబడులు రాబట్టేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేస్తుండడంతో పలు సంస్థలు ఇక్కడికే వస్తున్నాయన్నారు. విశాఖపట్నంలో ఐటీ రంగం, రాజమండ్రిలో ఆక్వా, మత్స్యరంగం, విజయవాడలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌, హార్టీకల్చర్‌ రంగాల్లో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చేందుకు ఫిక్కీ కృషి చేస్తుందన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా కొరియన్‌, చైనీస్‌ సిటీలు ఏర్పాటు కావాలని సూచించారు.