blog single post
GENERAL NEWS

2018-11-08 10:24:31

శరవేగంగా జరుగుతున్న రాజధాని రహదార్ల నిర్మాణం

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రహదారుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ డీ లక్ష్మీ పార్థసారథి పేర్కొన్నారు. ఆమె ఏడీసీ అధికారులతో కలిసి ఈ-2, ఈ-4, ఎన్-17, ఎన్-16, ఎన్-11 రహదార్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ రహదార్లలో అంతర్భాగంగా నిర్మిస్తున్న పవర్ డక్ట్‌లు, వరద నీటి కాలవల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమరావతి రహదార్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 
నిర్మాణ పనులు మరింత వేగంగా జరిపేందుకు కార్మికుల సంఖ్యను మరింత పంచుకోవాలని గుత్తేదారు సంస్థలను ఆదేశించారు. యుటిలిటీలు, వంతెనల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, దొండపాడు, అనంతపురం, మందడం గ్రామాల్లో రహదారి నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలన జరిపారు. ఈ పర్యటనలో ఏడీసీ సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఎంవీ సూర్యనారాయణ, పీ అంకమ్మచౌదరి, డీఈఈ కరుణాకర్, పవర్ అడ్వయిజర్ ఎంవీవీ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.