blog single post
National

2018-12-06 10:46:25

సిరిసేనను హిట్లర్‌తో పోల్చిన రాణిల్‌ విక్రమసింఘె!

గతకొద్ది రోజులుగా శ్రీలంకలో రాజకీయం అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరిణామాల నేపథ్యంలో...శ్రీలంక ప్రధాని పదవి నుండి తొలగించబడిన రాణిల్‌ విక్రమసింఘె దేశాధ్యక్షుడు సిరిసేనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను హిట్లర్‌తో పోల్చుతూ, రాజ్యాంగాన్ని తోసిరాజన్న నియంత హిట్లర్‌ మాదిరిగా వ్యవహరించవద్దని సూచించారు. అలా చేయడానికి ఆయనను ఎంత మాత్రమూ అనుమతించబోమని స్పష్టం చేశారు. 
అక్టోబరులో తనను తొలగించినప్పటికీ ప్రధానమంత్రి అధికార నివాసాన్ని ఖాళీ చేసేందుకు తిరస్కరిస్తున్న విక్రమసింఘె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో తనకు పూర్తి మెజారిటీ వున్నందున అధ్యక్షుడు తనను ప్రధానిగా నియమించాల్సిందేనని చెబుతున్నారు. తొలగించినప్పటికీ విక్రమసింఘె మద్దతుదారులు పార్లమెంట్‌లో మెజారిటీ వుందని చెబుతున్నారు. కాగా అధ్యక్షుడు నియమించిన రాజపక్సా విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. అయితే రాజపక్సా తన చట్టబద్ధతను రుజువు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు గడువు వుంది. 
ఒకవేళ విక్రమసింఘెకు 225 మంది సభ్యుల మద్దతు వున్నా ఆయన్ని తిరిగి నియమించేది లేదని సిరిసేన స్పష్టం చేశారు. రాజపక్సా తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దానిపై విచారణకు వెంటనే చేపట్టలేదు. నవంబరులో పార్లమెంట్‌ను రద్దు చేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయంపై ఈ వారంలో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది.