blog single post
Literature

2019-01-28 01:47:37

ఎన్టీఆర్ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం:కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు

బీజేపీ,వామపక్ష పార్టీలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు.ఎన్టీఆర్‌ రాజకీయ జీవితం తనలాంటి వారికి అనేకమందికి స్ఫూర్తినిచ్చిందని అన్నారు.అయితే అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అత్యున్నత స్థానాలకు వెళ్లిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని అన్నారు.కాగా విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి కె.చంద్రహాస్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డా.కె.లక్ష్మీనారాయణలు ఆంగ్లంలో రచించిన ‘ఎన్టీఆర్‌ ఏ బయోగ్రఫీ’ పుస్తకాన్ని నిన్న సాయంత్రం ఆవిష్కరించారు.మాదాపూర్‌లోని సైబర్‌ సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మాజీ విమానయాన శాఖ  మంత్రి అశోక్‌ గజపతిరాజు పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి ప్రతిని ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణకు అందజేశారు.ఈ సందర్బంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ … ఎన్టీఆర్‌ జీవిత చరిత్రకు సంబంధించి ఆంగ్లంలో మొదటిసారిగా పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని అన్నారు.ఈ పుస్తకాన్ని రచించిన చంద్రహాస్‌, కె.లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఏ బయోగ్రఫీ పుస్తకాన్ని తీసుకువచ్చేందుకు 3 నెలలపాటు పనిచేశామని తెలిపారు.అయితే రోజుకు 12 నుండి 14 గంటల పాటు పుస్తక రచనలోనే గడిపినట్లు చెప్పారు.భారతదేశంలో నాయకత్వానికి సంబంధించిన పుస్తకాలు అరుదుగా వస్తాయని చెప్పారు.ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లో ఎన్టీఆర్‌ జన్మించి ఉంటే ఆయనపై ఇప్పటికే కొన్ని వందల పుస్తకాలు వచ్చి ఉండేవని తెలిపారు.నిమ్మకూరు యువకుడు ఎన్టీఆర్‌గా ఎలా ఎదిగాడనేదే ఈ పుస్తకం సారాంశమని తెలిపారు.కాగా సీపీఐ సీనియర్‌ నేత నారాయణ, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్,మాజీ డీజీపీలు హెచ్‌.జె.దొర, రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.