blog single post
Literature

2018-09-28 08:20:06

ఘనంగా జాషువా 123వ జయంతి... సుద్దాల అశోక్‌ తేజకు కవితా పురస్కారం

గుర్రం జాషువా 123వ జయంతి సభను గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, ప్రజానాట్యమండలి, కెవిపిఎస్‌ సంయుక్తంగా నిర్వహించాయి. సభలో అభ్యుదయ కవి, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు గుర్రం జాషువా కవితా పురస్కారం-2018ను సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ప్రదానం చేశారు. సభకు విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ ట్రస్టీ పాశం రామారావు అధ్యక్షత వహించారు. 
ఈ సందర్భంగా బి.వి.రాఘవులు మాట్లాడుతూ,.. ఇప్పటికీ గ్రామాల్లో దళితులు, గిరిజనులపై వివక్ష కొనసాగుతోందని, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఎదురవుతున్న వివక్షపై దళితులు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. వివక్షకు వ్యతిరేకంగా సాహిత్యంతో మీసాలు మెలితిప్పిన ఘనత జాషువాకు దక్కిందని వ్యాఖ్యానిం చారు. అగ్ర కుల యువతి పంజాబ్‌లో దళిత కళాకారుడ్ని వివాహం చేసుకున్నందుకు ఆ యువకుడ్ని అగ్రకులస్తులు హత్య చేయగా ఇప్పుడు ఆమె డప్పు కళాకారిణిగా వివక్షపై పోరాటాలు చేస్తోందని తెలిపారు. 
సుద్దాల అశోక్‌ తేజ తండ్రి హనుమంతు కూడా తెలంగాణలో ఫ్యూడలిజం, రజాకర్ల వ్యతిరేక ఉద్యమం, వెట్టిచాకిరిపై తన రచనల ద్వారా తిరుగుబాటును ప్రదర్శించారని అన్నారు. సాహిత్యంలో విప్లవకవిగా, వాగ్గేయ కారుడుగా హనుమంతు గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. జాషువా, హనుమంతు స్థాయికి అశోక్‌ తేజ ఎదగాలని రాఘవులు ఆకాంక్షించారు. తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ, నాజర్‌, జాషువా, హనుమంతు వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పూర్వ వైభవాన్ని తేవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 
పురస్కార గ్రహీత సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ,.. తన పాటలకు తన తండ్రి హనుమంతు, గుర్రం జాషువా ఎంతో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. శ్రీశ్రీ, సినారే వంటి కవులతో పాటు సమాజంలోని ఎంతో మంది కవులు, కళాకారుల నుంచి వెలువడిన సాహిత్యమూ తన ఎదుగుదలకు ఉపయోగపడిందని తెలిపారు. సినీ పరిశ్రమలో ఆదిలో తనకు వివక్ష ఎదురైందని, దాసరి నారాయణరావు తనను బాగా ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సామాజిక అంశాలు, సమాజంలో తనకు ఎదురైన ఘటనలు ఆధారంగా రాసిన పాటలను పాడి ఆయన ఆహూతులను ఉర్రూతలూగిం చారు. సభలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, సాహితీవేత్తలు పోలే ముత్యం, ఎం.విజయలక్ష్మీ, కాకాని సుధాకర్‌, బి.వేదయ్య, సోమేపల్లి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.