Rajakiyam

2018-11-06 08:51:26

కుమారుడి మీద ప్రేమ ఉంటే చంకనెత్తుకుని తిప్పాలి...లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన పవన్

ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం సభలో మాట్లాడుతూ...సీఎం చంద్రబాబుకు కుమారుడి మీద ప్రేమ ఉంటే చంకనెత్తుకుని తిప్పాలి..కానీ మంత్రిని చేసి ప్రజల నెత్తిన కూర్చో పెడతానంటే ఎలా అని పవన్ అన్నారు.తెలుగుదేశం హయాంలో యువత ప్రతిభకు ప్రాథాన్యం, గుర్తింపు లేకుండా పోయిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి పేర నెలకు రెండు వేల రూపాయలు భిక్షం వేస్తున్నారని, వారి కలలను కళ్లలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పంచాయతీ శాఖ మంత్రి ఉద్యోగం ఇచ్చే కంటే తన కుమారుడు లోకేష్ కు నిరుద్యోగ భృతి ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే బాగుండేదన్నారు.  
నాలుకా నాలుకా ఇష్టానుసారం మాట్లాడితే వీపుకు దెబ్బలు పడతాయన్న సామెత చంద్రబాబుకు, లోకేష్ కు సరిగ్గా సరిపోతుందని పవన్ అన్నారు. చంద్రబాబు తన మామగారినే దెబ్బ కొట్టిన వ్యక్తి, నన్ను ఎదగనిస్తారని ఎన్నడూ అనుకోలేదని పవన్ అన్నారు. వాడుకుని వదిలేస్తారని తనకు ముందే తెలుసునన్నారు. అయినా తనకు వెన్నుపోటు పోడవడానికి తాను ఎన్టీఆర్ అంత మంచోడిని కాదని, రోడ్డు మీదకు వచ్చి చొక్కా పట్టుకునిలదీస్తానని పవన్ హెచ్చరించారు.
మత్స్యకారులకు ఒక సోదరుడిగా ఉంటా!....
తూర్పుగోదావరి జిల్లాలోని యూ కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులతో నిర్వహించిన సమావేశంలో పవన్  మాట్లాడుతూ… మత్స్యకారులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.మినీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మత్స్యకారులకు ఒక సోదరుడిగా ఉంటానన్నారు. మత్స్యకారుల సమస్యల త‌న‌కు తెలుసన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో తీర ప్రాంత కోతను అరికడతామన్నారు. 
ప్రభుత్వం మినీ హర్బర్ ను ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. మత్స్యకారులకు అండగా ఉండి మీ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మత్స్యకారుల సమస్యల కోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కొంచెం కష్టమైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మత్స్యకారుల కోసం మినీ కోల్డ్ స్టేరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకార యువత పర్యాటక రంగంలో భాగస్తులు కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు.  ఈ అందమైన తీర ప్రాంతాన్ని రక్షించడానికి విదేశీ టెక్నాలజీ వినియోగించి బీచ్ కోతను ఆపొచ్చన్నారు. 
పరిశ్రమల కాలుష్యంతో మత్స్య సంపద చనిపోతోందని, కొన్ని అరుదైన జాతులు అంతరించిపోతున్నాయన్నారు. కాలుష్యాలు వెదచల్లే పరిశ్రమలను అరికడతామన్నారు. కాలుష్యం శుద్ది చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారుల బోటులు, పడవలకు డీజిల్ సబ్సిడీ ఇచ్చే విధంగా చూస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.