Rajakiyam

2019-04-15 10:59:00

వీవీప్యాట్‌ల లెక్కింపు పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ వేస్తాం:సీఎం చంద్రబాబు

వీవీప్యాట్‌ల లెక్కింపు పై నిన్న ఢిల్లీలో జరిగిన  సమావేశంలో మీడియాతో బీజేపీయేతర పక్షాలు నేతలు మాట్లాడుతూ...ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు, రాజకీయ పార్టీలకు విశ్వాసం కల్పించడానికి వీలుగా కనీసం 50% వీవీప్యాట్‌లను లెక్కించాల్సిందేనని డిమాండు చేశారు. కాగా దేశంలో ఈనెల 11వ తేదీన జరిగిన మొదటి దశ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని,వాటిని దృష్టిలో ఉంచుకొని 50% వీవీప్యాట్‌లను లెక్కించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.ఈ సమావేశంలో  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌,కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం నేత నీలోత్పల్‌ బసు, ఎస్పీ నేత సురేంద్రసింగ్‌ నాగర్‌, జేడీఎస్‌ నేతలు పాల్గొన్నారు.నిన్న ఢిల్లీ లోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశమై 50% వీవీప్యాట్‌ల లెక్కింపు కోసం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలుచేసే విషయంపై చర్చించిన నాయకులు తరువాత అక్కడే జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.కాగా దేశంలో ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశానికి కొన్ని పార్టీల నేతలే హాజరైనప్పటికీ తమ డిమాండుకు మొత్తం 23 పార్టీలు మద్దతిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.అయితే ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటికీ దేశవ్యాప్తంగా పారదర్శక వ్యవస్థ తీసుకురావడం కోసమే తానీ పోరాటం ప్రారంభించినట్లు తెలిపారు.ఈ ఎన్నికల వ్యవస్థలో సంపూర్ణ పారదర్శకత సాధించేంత వరకూ పోరాడతామని అన్నారు. 9000 వేల కోట్లు ఖర్చుపెట్టి వీవీప్యాట్‌లను ఏర్పాటు చేసినప్పుడు వాటిని లెక్కించకపోతే ?.. ఉండీ ఏం లాభమని ముఖ్యమంత్రి చంద్రబాబు  నిలదీశారు.