Rajakiyam

2019-03-14 12:07:03

వైసీపీకి ఓటు వేస్తె మరణశాసనం రాసుకున్నట్లే:సీఎం చంద్రబాబు

ఉండవల్లిలోని ప్రజా వేదికలో నిన్న సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు మీడియా మాట్లాడుతూ … మీ భవిష్యత్తు- నా బాధ్యత అని ప్రజలకు తెలుగుదేశం పార్టీ  భరోసా ఇస్తుంటే జగన్‌ మాత్రం నా భవిష్యత్తు-మీ బాధ్యత అంటున్నారని విమర్శించారు.మీరు ఓట్లు వేసి గెలిపిస్తే  కేసుల నుండి బయటపడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జగన్ తాకట్టు పెడతారు.కాగా పోలవరం ప్రాజెక్టును ఆపడానికి తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తారని ఆరోపించారు.అయితే మార్పు కోసం తనకు ఓటు వేయాలని జగన్‌ అడుగుతున్నారు.అది మార్పు కాదు... మరణ శాసనమని వ్యాఖ్యానించారు.మన మరణశాసనంపై మనమే సంతకం చేసుకుంటామా?ఇలాంటి దుర్మార్గులకు ఓటు వేస్తామా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మన మీదకైతే ఒంటికాలి మీద వస్తారు కానీ...ఆంధ్రప్రదేశ్ డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ కట్టారన్న ఆరోపణ వస్తేనే కోర్టు వద్దన్నా తెల్లవారుజామునే వెళ్లి ధ్వంసం చేశారని గుర్తు చేశారు.అలాంటి కేసీఆర్ కు హిందూజా సంస్థ నుండి జగన్‌ 11 ఎకరాలు లంచంగా తీసుకోవడం కనిపించలేదా? ఇప్పుడు ఆ భూమి విలువ 500 కోట్లు రూపాయలకు చేరింది.వైసీపీ అధ్యక్షుడు జగన్‌,తెలంగాణ కేసీఆర్‌ లాలూచీకి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కాగా తెలంగాణ నుండి లక్ష కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉందని, వాటిని ఇవ్వలేదుగానీ అమరావతికి 500 కోట్ల రూపాయలు  ఇవ్వాలనుకున్నానని కేసీఆర్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు.అయితే ఇప్పుడు ఎన్నికల కోసం జగన్‌కు1000 కోట్ల రూపాయలు  ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పెత్తనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు.కాగా ఆంధ్రప్రదేశ్‌లోనే నివసించని జగన్‌కు నైతికంగా ఇక్కడ పోటీ చేసే హక్కు లేదన్నారు.తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు నిర్ణయాధికారాన్ని స్థానిక నాయకత్వానికే అప్పగించామని,తన ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్‌కేనని స్పష్టం చేశారు.ఇప్పుడు తెలుగుదేశం గెలుపు ఆంధ్రప్రదేశ్ కు చరిత్రాత్మక అవసరమని అన్నారు.ఏపీకి నాలుగు వైపులా నుండి గద్దల్లా వాలిపోతున్నారని అన్నారు.అయితే ఏప్రిల్‌ 11న పోలింగ్‌ పెట్టారంటేనే వాళ్ల కుట్ర అర్ధమవుతోందని మండిపడ్డారు.జనసేనతో తెలుగుదేశం పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు.