Rajakiyam

2019-03-14 10:05:40

నేరాలు చేయడంలో జగన్ జంత్రీ:సీఎం చంద్రబాబు

ఉండవల్లిలోని ప్రజా వేదికలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ...నేరాలు చేయడం, వాటి నుండి తప్పించుకోవడంలో వైసీపీ అధినేత  జగన్‌ గ్రాండ్‌ మాస్టరని మండిపడ్డారు.ఈ నేరాల నుండి తప్పించుకునేందుకు వీలుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌,ప్రధాని  మోదీ జగన్‌కు కాపలాదార్లుగా మారారని విమర్శించారు.అందుకే క్విడ్‌ ప్రో కో కేసులో రెండేళ్ల క్రితం ఈడీ లేఖ రాసినా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, సీబీఐ మొద్దు నిద్ర పోతోందని,హైదరాబాద్‌ నడిబొడ్డున అత్యంత విలువైన స్థలాన్ని జగన్‌ ఆక్రమించుకున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.ఈ ముగ్గురి కుమ్మక్కుకు రాజకీయాలకు ఇదే నిదర్శనమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.కాగా జగన్‌ అక్రమాస్తుల కేసు వ్యవహారం కేవలం 
46,500 కోట్ల రూపాయలకే పరిమితం కాదని,దీన్ని మరింత లోతుగా తవ్వాలని, సమీక్షించాలని ఈడీ చెప్పినా సీబీఐ పట్టించుకోలేదని అన్నారు. అయితే  జగన్‌కు ప్రధాని మోదీ అండగా ఉండటమే దీనికి కారణమని విమర్శించారు.
 
జగన్ కేసుల మాఫీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్న జగన్‌కు ఓట్లేస్తే మన మరణ శాసనాన్ని మనమే రాసుకున్నట్లవుతుందని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్నెర్ర జేస్తే జగన్‌ జైలుకు పోతారని చెప్పారు.అందుకే బాంచెన్‌ కాళ్లు మొక్కుతా అని కేసీఆర్ కు జగన్ లొంగిపోయారు. మరోపక్క జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో మళ్లీ సమగ్ర దర్యాప్తు జరపాలని 2 సంవత్సరాల క్రితం సీబీఐ డైరెక్టరు ఆలోక్‌ వర్మకు ఈడీ డైరెక్టరు కర్నల్‌ సింగ్‌ లేఖ రాసినా ఎందుకు తొక్కిపెట్టారో ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.