Rajakiyam

2019-02-11 12:18:41

ధనార్జనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం:ప్రధాని మోదీ

నిన్న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ గుంటూరులో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ప్రసంగిస్తూ ... లోకేష్‌ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదని అన్నారు.అవును అది నిజమే?నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు, కానీ అమరావతి నుండి పోలవరం వరకూ తన ఆస్తులు పెంచుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదని చెప్పారు.నన్ను కేవలం దేశ సంపదను పెంచడం కోసమే ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు.సొంత పిల్లల ఆస్తులు పెంచుకోవడం కాదు.దేశ బిడ్డల అభ్యున్నతి కోసం కృషి జరగాలి అని పేర్కొన్నారు.ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి నిజాలను వదలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్థం అని అన్నారు.

మహా కూటమి ఓ కల్తీ కూటమి

దేశాన్ని ఎవరైతే ఇంతకాలం పొగలో మగ్గేలా వదిలేశారో వాళ్లు ప్రస్తుతం దేశంలో అబద్ధాల పొగను వ్యాపింపజేయడంలో నిమగ్నమయ్యారని ప్రధాని మోదీ విమర్శించారు.మహా కూటమి పేరుతో ఆట ఆడుతున్నారు.ఇక్కడి ముఖ్యమంత్రి కూడా ఏపీ అభివృద్ధిని మరచిపోయి మోదీని తిట్టే పనిలో మునిగిపోయారని వ్యాఖ్యానించారు.మహా కూటమి క్లబ్‌లో మీ ముఖ్యమంత్రి చేరడానికి కారణం స్వార్థ రాజకీయాలను కాపాడుకునేందుకే అని అన్నారు.దాదాపు కూటమిలోని  ప్రతీ ఒక్కరూ పేదలకు,దేశానికి ద్రోహం చేసిన ఆరోపణల పై చట్టం కత్తి వేలాడుతున్నవారే అని అన్నారు.ఇది మహా కూటమి కాదు కల్తీ కూటమి అని వ్యాఖ్యానించారు.