Rajakiyam

2019-02-11 11:30:05

అబద్ధపు ప్రచారానికి గుంటూరు నుండి స్వస్తి పలకదలుచుకున్నా:ప్రధాని

ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల మేర ప్రాజెక్టులు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీపేర్కొన్నారు.ఓ పెద్ద అబద్ధపు ప్రచారానికి గుంటూరు నుండి స్వస్తి పలకదలుచుకున్నానని  అన్నారు.గడచిన 55 నెలల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఎటువంటి లోటూ చేయలేదని చెప్పారు.కానీ తెలుగుదేశం ప్రభుత్వం నిధులు సక్రమంగా ఖర్చు చేయడంలేదని అన్నారు.ప్రత్యేక హోదాకంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారు.ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా తీర్మానం చేశారని ప్రధాని గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ ను విభజించిన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది.నాడు కాంగ్రెస్‌ పార్టీ స్వలాభం కోసమే ఆంధ్రప్రదేశ్ విభజన చేసిందని అన్నారు.అటువంటి కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి చంద్రబాబు జతకట్టారు.అయితే మా పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాతో ఎంత ప్రయోజనం కలుగుతుందో ప్రత్యేక ప్యాకేజీ కింద అన్ని నిధులు వచ్చేలాచేశామని చెప్పారు.మొదట ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారని ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు.

మా ప్రభుత్వం చిత్తశుద్ధికి సాక్ష్యాలుఇవి ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన ప్రతీహామీపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. దీనికి నిదర్శనమే తిరుపతిలో ఐఐటీ,అనంతపురంలో కేంద్ర విశ్వవిద్యాలయం,విశాఖలో ఐఐఎం,మంగళగిరిలో ఎయిమ్స్‌ వంటి 11 ఉన్నత విద్యాసంస్థల్లో 10 ప్రారంభమయ్యాయని ప్రధాని చెప్పారు.కాగా విశాఖ - చెన్నె పారిశ్రామిక కారిడార్‌, 3 విమానాశ్రయాల విస్తరణ, మెట్రో,అమరావతితో అనుసంధాన రవాణ ప్రాజెక్టులు,8 భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో 6 ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయి.ఏపీ విభజన చట్టప్రకారం ఈ ప్రాజెక్టులను 10 ఏళ్ల వ్యవధిలో ఏర్పాటు చేయొచ్చు,కానీ మేము5 ఏళ్లలోపే అధికశాతం పనులను ప్రారంభించామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ లో ఉండే సమస్యలు నాకు తెలుసు,ఎందుకంటే ఇటువంటి సమస్యలను చాలాకాలం పాటు ముఖ్యమంత్రిగా నేనూ ఎదుర్కొన్నానని అన్నారు.అందువలనే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరగరాదని 2014లో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించానని తెలిపారు.మీకు నేను భరోసానిస్తున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మా వంతు కృషి చిత్తశుద్ధితో కొనసాగుతూనే ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు.