Rajakiyam

2019-02-11 10:50:29

తండ్రీ కుమారుడి రాజకీయం త్వరలోనే అంతం కాబోతుంది:ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని విస్మరించి తన కుమారుడు లోకేష్‌ రాజకీయ ఎదుగుదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు.ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తానే యూ టర్న్‌ తీసుకున్నారని దుయ్యబట్టారు.ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు కొత్త పథకాలు తీసుకువస్తానని హామీలు ఇచ్చి మా పథకాలకు స్టిక్కర్లు వేస్తున్నారని అన్నారు.కాగా నిన్న గుంటూరులో బీజేపీ ఏర్పాటుచేసిన ‘ప్రజా చైతన్య సభ’లో ప్రధాని నరేంద్రమోదీ చంద్రబాబే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.

అధికారంలోకి రావడం కోసం ఎవరితోనైనా జతకట్టే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. మహా కూటమి అపవిత్ర కలయిక అని అన్నారు.రాజకీయ స్వార్థం కోసమే మహా కూటమితో బాబు పొత్తు పెట్టుకున్నారని చెప్పారు.అయితే మహాకల్తీ కూటమిలో చంద్రబాబు చేరారని,ఎన్టీఆర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు.నా కన్నా సీనియర్‌ అని పదేపదే చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు తన సీనియార్టీతో ఏం సాధించారో అర్థం కావడంలేదని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ లో తండ్రీ కుమారుడి రాజకీయం త్వరలోనే అంతం కాబోతోందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు.కాగా ప్రజా చైతన్య సభలో 11.40కు మొదలైన ప్రధాని మోదీ ప్రసంగం 12.40 నిమిషాలకు ముగిసింది.అయితే ప్రధాని మోదీ హిందీ ప్రసంగాన్ని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలుగులోనికి అనువాదం చేశారు.