Rajakiyam

2019-01-11 01:52:32

ఏపీలో సైకిల్ తో హస్తం దోస్తీ లేనట్లే... !

ఇటీవల తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌,టిడిపి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపించడంలేదు.టీడీపీ అధినేత చంద్రబాబు,కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్‌గాంధీ ఈ నేపథ్యంలోనే తమ పార్టీల నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో విడిగా పోటీ చేసిన దేశ ప్రయోజనాల కోసం కేంద్రంలో బీజేపీకు వ్యతిరేకంగా కలిసి నడవాలని నిర్ణయానికి ఇద్దరు వచ్చారు అని తెలుస్తుంది.కేంద్ర ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందంటూ... ఎన్డీయే నుండి బయటకి వచ్చిన తెలుగుదేశం పార్టీ , ప్రత్యేక హోదా పై కాంగ్రెస్‌ పార్టీ నుండి స్పష్టమైన హామీ రావడంతో కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది.కాగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన ఈ బంధం క్రమంగా భాజపాయేతర కూటమి దిశగా అడుగులు వేసింది.

ఈ పరిణామంతో తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూటమి బలోపేతం దిశగా రాహుల్‌గాంధీ,చంద్రబాబు పలుసార్లు భేటీయ్యారు.ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న భావన రెండు పార్టీల కార్యకర్తల్లో నెలకొంది.ఈ ఊహాగానాలకు తెరదించుతూ…ప్రజల మనోభావాలకు తగట్లే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేసే విషయం పై నిర్ణయం తీసుకుంటామని టిడిపి అధినేత చంద్రబాబుఅంటున్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్‌గాంధీ కూడా ఈ విషయం పై ఏపీ కాంగ్రెస్‌ నేతలకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.ఢిల్లీ పర్యటనలో రాహుల్‌గాంధీతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాల ఐక్యతపై ప్రధానంగా చర్చించినట్లురాజకీయ వర్గాల నుండి సమాచారం. ఏపీలో పొత్తు గురించే కాకుండా జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రస్తుతం చాలా అవసరమనే అభిప్రాయానికి నేతలు రాహుల్ గాంధీ ,చంద్రబాబు వచ్చినట్లు సమాచారం.కాంగ్రెస్‌ వ్యతిరేక విధానాల నుండి పుట్టిన పార్టీ అయినందున ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకుంటే టిడిపికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోందిని ఆ పార్టీ వర్గాల ఆలోచన.

కాగా అతిత్వరలో అమరావతి వేదికగా నిర్వహించే  ఆఖరి ధర్మపోరాట సభకు జాతీయ నేతలతోపాటు రాహుల్‌ గాంధీను కూడా ఆహ్వానించాలని ఏపీ సీఎం ,టిడిపి అధినేత  చంద్రబాబు భావిస్తున్నారు అని సమాచారం.అయితే ఈ నెల 19న కోల్‌కతాలో మమతాబెనర్జీ నిర్వహించే సభలో అమరావతి ధర్మపోరాట సభ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అంటున్నారు.