Rajakiyam

2019-01-11 11:42:09

2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఓ సామాజిక ప్రయోగం:పవన్ కళ్యాణ్

విజయవాడలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న కడప,గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు,నాయకులతో  పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశమయ్యారు.ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ …. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకు మద్దతిచ్చి ఒక సామాజిక ప్రయోగం చేశాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.ఈ  ప్రయోగం విజయవంతం కావడం వల్లే జనసేన పార్టీ బలంగా దూసుకుపోయింది అని తెలిపారు.అయితే ఎదుటివారిని బలంగా ప్రశ్నించాలంటే నైతిక బలం కావాలి అని చెప్పారు.అందువలనే నాడు టిడిపి, బీజేపీకు మద్దతు ఇచ్చి విజయం చేకూరేలా చేశాను అని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది అని అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా,అమరావతి ముందుకు వెళ్లాలన్నా జనసేన పార్టీ అవసరం ఉంది అని ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ చెప్పారు.కాగా 2019 ఎన్నికల్లో అద్భుతం సృష్టిస్తామో లేదో తెలియదు కానీ,జనసేన బలంగా అయితే నిలబడుతుందని అన్నారు.

తెలుగుదేశం నేతలను నేను ఎప్పడు వ్యక్తిగతంగా విమర్శించలేదు

తెలుగుదేశం పార్టీ నాయకులను నేనెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదు.జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక పరిధిలో మాత్రమే విమర్శలు చేశాను అని పవన్ అన్నారు. ప్రతిపక్ష నేతలా చంపేయండి, చింపేయండి అని నేను ఎప్పుడు అనలేదు అని అన్నారు. అయితే 2014లో జగన్‌ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు... ఏం చేయగలవంటూ అంతా నన్ను ప్రశ్నించారు.నేను ముఖ్యమంత్రి కావడానికి రాజకీయాల్లోకి రాలేదు అని పవన్ అన్నారు.కాగా సగటు మనిషి ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వడానికే వచ్చానని వారితో చెప్పాను. 2014లో ఎన్నికల్లో పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని తొలుత భావించాను… అయితే, అలా చేస్తే పార్టీ బలపడదన్న ఉద్దేశంతోనే పోటీకి దూరంగా ఉండి ఆ పార్టీలకు మద్దతు పలికి విజయం చేకూరేలా చేశాను అని అన్నారు.దేశానికి నరేంద్రమోదీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేస్తారనే గట్టి నమ్మకంతోనే మద్దతిచ్చాను.అయితే సీఎం చంద్రబాబు మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండాలంటారు... ప్రతిపక్ష నేత జగన్‌ 30 ఏళ్లు అధికారం కావాలంటారు అని…పదవి కాదు.. 3 తరాలు బాగుండాలనే ఆకాంక్ష ముఖ్యం అని పవన్‌ అన్నారు.కాగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందన్నారు.