blog single post
Headlines

2018-11-08 07:17:50

కుమారస్వామి,దేవెగౌడతో ముగిసిన భేటి!..లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలి:దేవెగౌడ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈరోజు మ‌ధ్యాహ్నం కర్ణాటక సిఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. బెంగళూరు చేరుకున్న సీఎం చందబ్రాబుకు స్వాగ‌తం ప‌లికారు. పద్మనాభనగర్ లోని దేవెగౌడ నివాసంలో చంద్రబాబు సమావేశమయ్యారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు.
భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చింది:దేవెగౌడ
సమావేశo ముగిసిన అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ… లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని అన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలను భాజపా ప్రభుత్వం శక్తి హీనం చేస్తోందన్నారు. భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. సెక్యులర్ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి చంద్రబాబు కష్టపడుతున్నారన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మరిన్ని పరిణామాలు జరుగుతాయన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఈ ప్రయత్నం సఫలమవుతుందని భావిస్తున్నానన్నారు.
చంద్రబాబు పునఃరాగమనం...1996 మళ్లీ పునరావృతం: సీఎం కుమారస్వామి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు,మాజీ ప్రధాని దేవేగౌడల మధ్య ఎంతో కాలంగా రాజకీయ మిత్రత్వం ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై తాము చర్చించామని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు మళ్లీ రంగప్రవేశం చేసారని... 1996లో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిందని, 2019 ఎన్నికల్లో కూడా అదే మరోసారి పునరావృతం కాబోతోందని చెప్పారు. 
మాజీ ప్రధాని దేవేగౌడ ఆశీస్సుల కోసమే ఇక్కడికి వచ్చా: సీఎం చంద్రబాబు
ఎన్డీయేకు వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేసే క్రమంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఆశీస్సులు తీసుకోవడానికి, ఆయన మద్దతు కోరడానికే తాను బెంగళూరుకు వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో మన దేశాన్ని పాలించిన యునైటెడ్ ఫ్రంట్ కు దేవేగౌడ ఛైర్మన్ గా, తాను కన్వీనర్ గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి దేవేగౌడతో పాటు తనలాంటి నేతలంతా ఏకం కావాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామిలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీబీఐ, ఆర్బీఐలాంటి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలను కూడా ఎన్డీయే ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా వ్యవస్థను తాము నడపలేమంటూ సాక్షాత్తు ఆర్బీఐ గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. విపక్షాలను కంట్రోల్ చేయడానికి ఈడీ, ఐటీ వ్యవస్థలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విపక్ష పార్టీల నేతలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.