blog single post
Headlines

2018-11-07 10:41:30

మనిషిలో రాక్షసత్వం పోయి.. మానవత్వం పరిఢవిల్లాలి: సీఎం చంద్రబాబు

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు వెదజల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కార్తీక దీపకాంతులకు దీపావళి నాంది పలుకుతుందని... ఈ పండుగను తెలుగువారంతా సంబరంగా స్వాగతించాలని చెప్పారు. తెలుగువారందరికీ శాంతి, సౌభాగ్యం, సర్వ సుఖాలను భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మనిషిలో ఉన్న రాక్షసత్వం పోవాలని, మానవత్వం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. 
చీకట్లు తొలగి వెలుగులు విరజిమ్మాలి: వైఎస్ జగన్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ విపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖతాలో ఓ ట్వీట్ ను ఆయన పెట్టారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తిమీద దైవ శక్తి సాధించే విజయానికి ప్రతీకే ఈ దీపావళి పండుగని ఆయన అభివర్ణించారు. ఈ దీపావళి ప్రతి ఇంటా కోటి కాంతుల ఆనందాలు నింపాలని కోరుకుంటున్నాని, అందరిలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. కాగా, తనపై జరిగిన హత్యాయత్నం తరువాత జగన్, ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వారాంతం నుంచి ఆయన పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.
గవర్నర్‌ నరసింహన్‌ దీపావళి శుభాకాంక్షలు
తెలుగురాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ నరసింహన్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు దీపావళి ప్రతీకగా నిలుస్తుంది. శాంతికి, మత సామరస్యానికి, సమసమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శం. రెండు తెలుగురాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో దీపావళి జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.