blog single post
Headlines

2018-11-06 10:49:32

నేడు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు..ట్రంప్‌కు ఈ ఎన్నికలు రిఫరెండమ్‌ కానున్నాయా?

నేడు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగనున్నాయి. యూఎస్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు, 100 సెనెట్‌ స్థానాల్లోని 35 స్థానాలకు ఎన్నికలు ఈరోజు జరుగనున్నాయి. అధ్యక్షుడి పాలన కాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీటిని మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తారు. ప్రతినిధుల సభ సెనేట్‌తో పాటు 39 రాష్ట్రాలు, ప్రాదేశిక పాలనా మండళ్లకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరగనున్నాయి. 36 రాష్ట్రాలకు గవర్నర్లు నియామకం కానున్నారు. రెండేండ్ల ట్రంప్‌ పాలనకు ఈ ఎన్నికలు రిఫరెండమ్‌ కానున్నాయి. 
ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరికి వారు తామే మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్నారు. అధ్యక్షుడు ట్రంప్‌ 22 నెలల పాలనపై రిఫరెండమ్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్లు గెలిస్తే వివాదాప్పద నిర్ణయాలు, ఆదిపత్య చర్యలు తీవ్రమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డెమోక్రట్లు గెలుపొందినట్టయితే ట్రంప్‌ దూకుడుకు ముకుతాడు పడుతుందని అంటున్నారు. ప్రతినిధుల సభకు రెండేండ్లకు ఓ సారి ఎన్నికలు జరుగుతాయి. 
గత ఎన్నికల్లో డొనాల్ట్‌ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్స్‌ పార్టీ 247 స్థానాల్లో విజయం సాధిస్తే.. డెమోక్రాట్లు 188 సీట్లలో గెలిచారు. ప్రస్తుతం రిపబ్లికన్స్‌కు 236 మంది, డెమోక్రాట్లకు 196 మంది సభ్యులు ఉన్నారు. ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. 1934 నుంచి ఇంత వరకు 21 సార్లు మధ్యంతర ఎన్నికలు జరిగితే కేవలం మూడు సార్లు మాత్రమే అధ్యక్ష పార్టీ గెలిచింది. వంద సీట్ల సెనేట్‌లో 51 మంది రిపబ్లికన్లు, 49 మంది డెమోక్రాట్‌ సభ్యులు ఉన్నారు. ఉభయ సభల్లోనూ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్లదే మెజారిటీ. అమెరికాలోని 50 రాష్ట్రాలకు గాను 33 రాష్ట్రాల్లో రిపబ్లికన్లే గవర్నర్‌ పదవిలో ఉన్నారు.