blog single post
Headlines

2019-04-15 11:19:21

వచ్చే నెల 10న విడుదల కానున్నస్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

పురపాలక,పంచాయతీ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం సన్నాహాలు మొదలు పెట్టింది.కాగా పురపాలక ఎన్నికలు వచ్చే నెల 1లోగా,అలానే గ్రామ పంచాయతీల్లో వచ్చే నెల 10 లోగా తాజా వివరాలతో తుది ఓటర్ల జాబితాలను విడుదల చేయాలనీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.ఆంధ్రప్రదేశ్ లోని 91 పురపాలక సంఘాలు, అలానే నగర పంచాయతీల్లో, 7 నగరపాలక సంస్థల్లో పాలకవర్గ పదవీ కాలం వచ్చే జులై 2తో ముగియనుంది.కాగా  2 సంవత్సరాల క్రితం హైకోర్టు ఆదేశాలతో కాకినాడ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించారు.అయితే శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు నగరపాలక సంస్థల్లో 8 నుండి పదేళ్లుగా పాలకవర్గాల్లేవు అని తెలుస్తోంది.అలానే రాజాం,, కందుకూరు,నెల్లిమర్ల, అనపర్తి, రాజంపేట పురపాలక సంఘాలకూ వివిధ కారణాలతో గతంలో ఎన్నికలు నిర్వహించలేదు.ఈ సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా వీటికి ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు ఇప్పటికే నిలిచిపోయాయని సమాచారం.ఈ ఎన్నికల నిర్వహణ  జాప్యంపై హైకోర్టులోనూ కేసులు నమోదు కావడంతో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సార్వత్రిక ఎన్నికలకు వినియోగించిన జాబితాల నుండి పురపాలక,నగరపాలక సంస్థల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించి విడుదల చేయాలని ఇటీవలే ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ప్రక్రియ ప్రారంభమైంది.ఆంధ్రప్రదేశ్ లోని 110 పురపాలక, నగరపాలక సంఘాలకు, 13 నగరపాలక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.కాకినాడ నగర పాలక సంస్థ పదవీ కాలం మరో 3 సంవత్సరాలు ఉన్నందున ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఆంధ్రప్రదేశ్ లోని 12,918 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం గత సంవత్సరం ఆగస్టు 1న ముగిసింది.అయితే ప్రత్యేక అధికారులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ సర్పంచులు వేసిన పిటిషన్‌ పై ఉమ్మడి హైకోర్టు అక్టోబరు 23న 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.అలానే రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఎన్నికల నిర్వహణకు ఉన్న ఇబ్బందులపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌ చేసింది.దీనిపై ఇంకా విచారణ జరగాల్సి ఉంది. 1,093 మంది జడ్పీటీసీలు, మరో 16,214 మంది ఎంపీటీసీల పదవీ కాలం జులై 7తో ముగియనున్నందున అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తుంది.కాగా పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు రూపొందించి వచ్చే నెల 10లోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలనీ ఎన్నికల సంఘం భావిస్తోంది.