blog single post
Headlines

2019-03-14 03:32:45

ఓటు నమోదుకు గడువు పెంచే ప్రసక్తే లేదు: జీకే ద్వివేది

ఓటు హక్కు నమోదుకు రేపటితో గడువు ముగుస్తుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది అన్నారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎన్నికలు ముగిసిన తరువాత పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని ఆయన తెలిపారు. గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుపైనే ఉందన్నారు. అనేక మాధ్యమాల ద్వారా ఓటరు నమోదు, తనిఖీకి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ స్థాయిలో ఓట్లు పెరిగేందుకు ప్రజలతో పాటు అన్ని వర్గాల కృషి ఉందన్నారు. ఇంటర్నెట్ లో సర్వర్‌ డౌన్‌ అయితే  ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. ఓటరు నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని చెప్పారు. 7.9 శాతం వరకూ ఓటర్లు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీలో ఓటర్ల సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. జనవరి 11కు ముందు 20లక్షల కొత్త ఓట్లు జాబితాలో చేర్చామని తెలిపారు. ఈ నెల 25 తర్వాత మరో 20లక్షలకు పైగా ఓట్లు పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు.