blog single post
Headlines

2019-03-13 03:50:44

మంగళగిరి నుండి పోటీ చేయనున్న మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు,ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేసే స్థానంపై  ఉత్కంఠ వీడింది.ఏపీ రాజధాని ప్రాంతంలోని మంగళగిరి శాసనసభ స్థానం నుండి లోకేష్ ను బరిలో దించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.పార్టీలో జరిగిన విస్తృత చర్చల అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్  ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. రాజధాని ప్రాంతంగా మంగళగిరి అభివృద్ధి చెందడంతో పాటు మున్ముందు సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే లోకేష్ ఇక్కడి నుండే బరిలో దించితే బాగుంటుందని చంద్రబాబు భావించినట్టు చెబుతున్నారు.మొదట కుప్పం,భీమిలి, విశాఖ ఉత్తరం, పెదకూరపాడు వంటి నియోజకవర్గాల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ చివరికి మంగళగిరిని ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో లోకేష్ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుండి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్థి ఓటమిపాలయ్యారు.  

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా పై తెలుగుదేశం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది.ఏ స్థానం  నుండి ఎవరిని బరిలో దింపాలనే విషయం పై ఆచితూచి వ్యవహరిస్తోంది.టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్ధంచేసినప్పటికీ… పెండింగ్‌ స్థానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఒంగోలు లోక్‌సభ స్థానం నుండి మంత్రి శిద్ధా రాఘవరావును బరిలో దిగితే ,శిద్ధా ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి స్థానాన్ని ఇటీవల టీడీపీలో చేరిన ఉగ్ర నర్సింహారెడ్డికి సీఎం చంద్రబాబు కేటాయించారు.