blog single post
Headlines

2019-03-12 04:36:53

వంగవీటి రాధా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ ఏ పార్టీలో చేరాలని అనే అంశంపై  ఇప్పటికీ ఏమి తేల్చుకోలేకపోతున్నారు.కాగా రాజీనామా చేసిన తరువాత రోజే రాధా టిడిపిలో చేరుతారని వార్తలు వచ్చిన అవన్నీ పుకార్లేనని తేలిపోయింది.ఇదే కాదు రాధా టీడీపీలోకి వస్తున్నారని అందరూ సహకరించి కలిసి మెలిసి పనిచేయాలని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పారు.అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ మళ్లీ టీడీపీలో చేరకుండా మౌనం అయిపోయారు.దీనితో మరోసారి విజయవాడకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు రంగంలోకి దిగి పార్టీలోకి తిరిగి చేరాలని మంతనాలు కూడా జరిపారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

నిన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వంగవీటి రాధా వెళ్లారు.అయితే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటితో కలిసి రాధా ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు.దాదాపు 2 గంటలపాటు రాధా తన రాజకీయ భవిష్యత్‌పై ముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం.అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపు వంగవీటి రాధా టీడీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.వంగవీటి రాధా తెలుగుదేశంలో చేరితే ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు? అసలు పోటీ చేస్తారా? లేదా? అనే అంశం పై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు.కాగా వంగవీటి అభిమానులు, అనుచరులు మాత్రం విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేయాలని రాధా పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.