Headlines

2019-02-10 07:21:54

ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే మీతో ఏకీభవించను:ప్రధాని మోదీ

ఈరోజు గుంటూరులో బీజేపీ ప్రజా చైతన్య సభలో ప్రధానమంత్రిమోదీ మాట్లాడారు. ఏ పార్టీ అయితే రాష్ట్రాన్ని మోసం చేసిందో ఆ పార్టీతోనే జట్టు కట్టారంటూ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధుల కంటే ఎక్కువే ఇచ్చామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్ర పథకం హృదయ్‌ కింద అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించామని ఆయన తెలిపారు.చంద్రబాబు కూడా ఏపీ అభివృద్ధిని మరిచి మోదీ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామి అయ్యారు. ఏపీలో మౌలిక వసతులను గొప్పగా మారుస్తామన్నారు. అమరావతిని నిర్మిస్తానని చెప్పి.. కూలిన పార్టీని నిర్మించే పనిలో ఉన్నారు. సన్‌రైజ్‌ రాష్ట్రం చేస్తానని చెప్పి.. కుమారుడి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. నా కంటే సీనియర్‌ అంటారు గానీ ఆయనకంటూ చెప్పుకునేందుకు ఏమీ లేదు. సీనియర్‌ నాయకుడైనందుకు మీకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇచ్చాను. కొత్త కూటములు జత కట్టడంలో మీరు సీనియర్‌. ఏపీ ప్రజల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్‌. ఎన్నికల్లో ఓడిపోవడంలో మీరు సీనియర్‌. ఆ విషయంలో నేను పోటీ పడలేను. ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే మాత్రం మీతో ఏకీభవించను. కాంగ్రెస్‌ స్వలాభాల కోసం రాష్ట్ర విభజన చేసింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విభజన చేయలేదు. 2016 సెప్టెంబర్‌లో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశాం. ప్రత్యేక ప్యాకేజీ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెప్పారు. ప్యాకేజీపై శాసనసభలో అభినందిస్తూ తీర్మానం చేశారు. మేం ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశాం. ప్యాకేజీని వినియోగించుకోవడంలో సీఎం విఫలమయ్యారని మోదీ పేర్కొన్నారు.