Headlines

2018-12-04 08:38:29

రేవంత్ ను ఎందుకు అరెస్ట్ చేశామో.. రేపు చెబుతాం!:అడ్వకేట్ జనరల్

తెలంగాణ ముఖ్య కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఆయన ఆచూకీ తెలపాలని ఆదేశించిన నేపద్యంలో...రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశామో రేపు హైకోర్టుకు తెలియజేస్తామని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తెలిపారు.కాంగ్రెస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు రేవంత్ ఆచూకీ తెలపాలని విచారణను నాలుగు గంటలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరిగి కోర్టు విచారణ ప్రారంభించగానే రేవంత్ ను విడుదల చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. అర్ధరాత్రి పూట ఆయనను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందన్న కోర్టు ప్రశ్నకు కారణాలను రేపు వివరిస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.
ప్రజల్ని భయపెడితే గెలుస్తామనుకోవడం కేసీఆర్‌ భ్రమ:రేవంత్ రెడ్డి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు విడుదల అయి కొడంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డి తన నివాసం వద్ద భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రజల హక్కుల కోసం గళంవిప్పిన తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారని, నియంతల పాలనలో కూడా ఇంతటి అరాచకాలు జరగలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ప్రతిపక్షాల గొంతునొక్కడానికి కేసీఆర్‌ ఎంతకైనా తెగిస్తారని రేవంత్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ ముందు కొడంగల్‌ ప్రజల మనసులు గెలవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల్ని భయపెడితే గెలుస్తామనుకోవడం కేసీఆర్‌ భ్రమని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.