blog single post
Headlines

2018-12-04 08:55:02

రేవంత్ రెడ్డి అరెస్టు...

తెలంగాణా కాంగ్రెస్ ముఖ్య నేత రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కొడంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను అడ్డుకునేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని ఈసీకి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు,..రేవంత్‌ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, కొడంగల్‌ బంద్‌కు పిలుపునిచ్చారని ఫిర్యాదు చేయండంతో రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసీ ఆదేశాలతో ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కొడంగల్‌ పోలీసు స్టేషన్‌లో రేవంత్‌పై కేసు నమోదు చేసినట్లు అదనపు డీజీపీ జితేందర్‌ తెలిపారు. 
ఓ ఉగ్రవాదిలా బరబరా ఈడ్చుకు వెళ్లారు:రేవంత్ రెడ్డి సతీమణి
రేవంత్ రెడ్డిని ఓ ఉగ్రవాదిలా చూశారని, తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తలుపులు బద్దలుగొట్టి లోపలికి చొరబడ్డారని రేవంత్ రెడ్డి సతీమణి  గీత ఆరోపించారు. అందరం ఉండగానే కేవలం ఐదు నిమిషాల్లోనే ఆయనను ఉగ్రవాదిలా బరబరా ఈడ్చుకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఐడీ కార్డులు కూడా చూపించకుండా పోలీసులు ఇంట్లోకి చొరబడ్డారని, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరింట్లోకి పడితే వారింట్లోకి వెళ్లడానికి పోలీసులకు హక్కు ఉందా? అని ప్రశ్నించారు. అటువంటి హక్కును రాజ్యాంగం వారికేమైనా ఇచ్చిందా? అని నిలదీశారు. 
తమ ఇంటికి వచ్చిన పోలీసులు ఎవరో కూడా తమకు తెలియదని, ఒక అధికారి మాత్రం పై అధికారుల ఆదేశాల మేరకే అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారని గీత తెలిపారు. ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు. కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని, శాంతియుతంగా నిరసన తెలపాలని, హింసకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో చూపించాలని, నియంత పాలనకు చరమ గీతం పాడాలని కోరారు.
కాగా రేవంత్‌రెడ్డిని ఇతర నియోజకవర్గాల్లో తిరగకుండా అడ్డుకొనేందుకే అధికారపక్షం ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇప్పటికే కేసీఆర్ సభ నిర్వహించే బొమ్మరాస్‌పేటలో నేటి సాయంత్రం వరకు 144 సెక్షన్ విదించిన విషయం తెలిసిందే.