blog single post
editoryal

2019-03-23 11:51:01

" ఇంక్విలాబ్ జిందాబాద్ “... " ఇంక్విలాబ్ జిందాబాద్ “

జీవితాన్ని ప్రేమిస్తాం,

మరణాన్ని ప్రేమిస్తాం,

మేం మరణించి ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం,

ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం,నిప్పురవ్వల మీద నిదురిస్తాం అంటూ ..నినదించిన షహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నేడు ఆయన్ని స్మరిస్తూ …సాయుధ పోరాటంతో భారతీయులకు స్వేచ్చ లభిస్తుందని భావించి, స్వతంతర్య పోరాటంతో యువతకు ఉద్యమస్పూర్తిని నింపి,చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన నిజమైన దేశభక్తుడు భగత్ సింగ్ అని అందరికీ తెలుసు.సుభాష్ చంద్రబోస్ , అల్లూరి సీతారామరాజు,చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో దేశానికి స్వాత్రంత్ర్యం తేవడానికి ప్రాణాలకు తెగించి సాయుధపోరాటానికి తన ప్రాణాలను బలి చేసిన గొప్పవీరుల్లో ఒకరైన భగత్ సింగ్ జీవిత విశేషాలు ఓసారి తెలుసుకుందాం…!

భగత్ సింగ్ బాల్యం :-

భగత్ సింగ్ పంజాబ్‌లోని లాయల్‌‌పూర్ జిల్లా, బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ మరియు విద్యావతి దంపతులకు పుట్టిన సంధు ఝాట్ కుటుంబీకుడు.భగత్ అనే పదానికి "భక్తుడు" అని అర్థం. సింగ్‌ యొక్క దేశభక్త సిక్కు కుటుంబంలోని కొందరు భారత స్వాతంత్ర్యోద్యమాల్లోనూ మరికొందరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేశారు. భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి " ఏం చేస్తున్నావ్ నాన్నా" అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలు ఇవి " తుపాకులు నాటుతున్నా". భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. స్వామి దయానంద సరస్వతిఅనుచరుడైన సింగ్ తాత అర్జున్ సింగ్ హిందూ సంస్కరణ ఉద్యమం, ఆర్యసమాజ్‌ లో భాగం కావడం కూడా ఆయనపై విపరీతమైన ప్రభావం పడేందుకు దోహదపడింది. ఆయన పినతండ్రులు అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ తండ్రులు కర్తార్ సింగ్ సారభా గ్రివాల్ మరియు హర్ దయాల్ నేతృత్వంలోని గద్దర్ పార్టీ సభ్యులే. తనపై ఉన్న అపరిష్కృత కేసుల కారణంగా అజిత్ సింగ్ పెర్సియాకు పారిపోగా, కకోరి రైలు దోపిడీ 1925లో హస్తముందంటూ స్వరణ్ సింగ్‌ను 19 డిసెంబరు 1927న ఉరితీశారు.బ్రిటీషు సంస్థల యెడల పాఠశాల అధికారులకు ఉన్న విధేయత ఆయన తాతకు నచ్చకపోవడంతో భగత్ తన వయస్సు సిక్కులు వలె లాహోర్‌లోని ఖల్సా ఉన్నత పాఠశాలకు హాజరు కాలేదు.బదులుగా ఆర్యసామాజిక పాఠశాల దయానంద్ ఆంగ్లో వేదిక్ ఉన్నత పాఠశాలలో భగత్‌ను ఆయన తండ్రి చేర్పించాడు.13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి భగత్ సింగ్ ప్రభావితుడయ్యాడు.ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ సింగ్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్‌ లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు.మహాత్మ గాంధీ అహింసావాదంపై అసంతృప్తి చెందిన భగత్ సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.

బ్రిటిష్ ప్రభుత్వం పై తిరుగుబాటు

లాలా లజ్‌పత్ రాయ్ మరణం ,సాండర్స్ హత్య 1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి.దీనితో దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి.అయితే 1928 అక్టోబరు 30న కమిషన్ లాహోర్‌‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు.లాలా లజ్‌పత్ రాయ్‌ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు.దీనితో లాలా లజ్‌పత్ రాయ్‌ తీవ్రంగా గాయపడ్డారు.ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.బ్రిటిష్ పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో భగత్ చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై పాల్ ఆయన్ను కాల్చమంటూ భగత్  సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటుగా డీఎస్పీ J. P. సాండర్స్ కనిపించినప్పుడు భగత్ సింగ్‌కు జై పాల్ సంకేతమిచ్చాడు.దీనితో స్కాట్‌కు బదులు సాండర్స్ మరణించాడు.కాగా బ్రిటిష్ పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ సింగ్ లాహోర్‌ పారిపోయాడు.తనని ఎవరు గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలను భగత్ సింగ్ కత్తిరించుకున్నాడు.

అసెంబ్లీ పై బాంబు దాడి యత్నం

విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా బ్రిటిష్ ప్రభుత్వం రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు  ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది.భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచివేయడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్ధేశ్యం… అయితే అనంతరం ప్రజాహితం కోసమేనంటూ ప్రత్యేక శాసనం కింద బ్రిటిష్ అధికారాలు ఈ చట్టాన్ని ఆమోదించారు.ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభ పై బాంబు పేలుడుకు హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం ప్రణాళిక రచించింది.అయితే బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అడ్డుకున్నాడు.అయితే భగత్ సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు భగత్ పై ఒత్తిడి తీసుకొచ్చారు.అసెంబ్లీపై భగత్ సింగ్‌తో పాటు మరో విప్లవకారుడు 1929  ఏప్రిల్ 8న అసెంబ్లీ పై భగత్ సింగ్ మరియు దత్‌లు బాంబు విసిరిన తర్వాత భగత్ సింగ్ "ఇంక్విలాబ్ జిందాబాద్ .. ! వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలు కరపత్రాలను విడిచి వెళ్లారు.కేంద్ర అసెంబ్లీ ఆవరణలో కరపత్రం విసిరివేత బాంబు దాడి వలన ఏ ఒక్కరూ మరణించడం గానీ గాయపడటం గానీ జరగలేదు.ఇది తమ వ్యూహంలో భాగంగా ఉద్ధేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో దాడి చేసినట్లు భగత్ సింగ్, దత్ అంగీకరించారు.అలానే ఈ బాంబు గాయపరిచేటంత శక్తివంతమైంది కాదని బ్రిటీష్ విచారణాధికారులు కూడా తేల్చిచెప్పారు. బాంబు దాడి తర్వాత భగత్ సింగ్, దత్ ఇద్దరూ లొంగిపోయారు.1929 జూన్ 12న భగత్ సింగ్ మరియు దత్‌ 'జీవితకాల దేశ బహిష్కరణ'కు గురయ్యారు.

విచారణ& ఉరి ..!

భగత్ సింగ్ అరెస్టు అనంతరం అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో J. P. సాండర్స్ హత్య వెనుక భగత్ హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది.ఈ  హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు.భారత స్వాతంతర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు.ఈ హత్యా నేరాన్ని అంగీకరించిన భగత్ సింగ్ విచారణ సమయంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు.ఈ విచారణ సమయంలో HSRA సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు.తద్వారా భగత్  సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో సింగ్ మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు.

1931 మార్చి 23న భగత్ సింగ్‌తో పాటు తన సహచరులు రాజ్‌గురు,సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు.భగత్ సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు భగత్ సింగ్ ఆ వెంటనేషహీద్ గా ప్రకటించారు.ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు అంతకు ముందు నుండి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు.రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను సింగ్ అధ్యయనం చేశాడు.పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు.

మేరా రంగ్ దే బసంతీ చోలా

ఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా

మేరా రంగ్ దే బసంతీ చోలా

యహీ రంగ్ హల్దీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా

నవ్ బసంత్ మే, భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా

మేరా రంగ్ దే బసంతీ చోలా...!

గంభీరమైన గొంతుతో భగత్ సింగ్ పాడుతున్న ఈ పాటను విని జైలు వార్డర్లు కూడా ముగ్ధులయ్యేవారు.అప్పటి బ్రిటిష్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ V.N. స్మిత్ భగత్ సింగ్‌ను ముందుగానే ఉరితీశారని తెలిపారు. సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీసేవారు.అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే భగత్ సింగ్ ను ఉరితీయాలని నిర్ణయించారు.సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుండి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి.సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద భగత్ సింగ్‌‌ను దహనం చేశారు.

భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్ర బోస్, చంద్రశేఖర ఆజాద్  వంటి వారికి ప్రజల నుండి పూర్తి సహకారం అంది ఉంటే స్వాతంతర్యం ఏనాడో వచ్చి ఉండేది.వారంతా చానాళ్ళు జీవించి ఉండేవారు అయితే ఇప్పడు మన దేశం ఇలా ఉండేది కాదు.నిజంగా వారు ప్రాణాలతో ఉండి ఉంటే ఇప్పటిలా సన్నాసులు దద్దమ్మలు నేరస్ధులు అవకాశవాదులు కాక, సమర్ధులు నీతిమంతులు, ఆదర్శప్రాయులు నిజాయితీపరులు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చి ఉండేవారు.కులపిచ్చితో మతపిచ్చితో కొట్టుమిట్టాడుతూ పచ్చనోటుకీ మద్యం సీసాలకీ అమ్ముడుపోతూ అవగాహన లేని ఆవేశాలతో  అదుపులేని ఉద్రేకాలతో సినిమా హీరోలకో అవినీతి నాయకులకో జై కొడుతూ తిరగాల్సిన వయసులో..... భారతదేశ స్వేచ్చ కోసం, భారతీయుల బానిసత్వాన్ని పోగొట్టడం కోసం , దేశ ప్రగతి కోసం, ప్రజాక్షేమం కోసం ఆలోచనన చేస్తూ తమ జీవితాలను త్యాగం చేసి  ప్రాణాలను సైతం అర్పించిన భగత్ సింగ్ కు మనస్పూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం జైహింద్...!

 

                                                                                                                                                                                            _____________________నవయువగళం