blog single post
editoryal

2019-03-18 07:13:34

మన ఎన్నికల ప్రక్రియ & ప్రవర్తనా నియమావళి…!

ఎన్నికలకు (పోలింగ్ కు) ముందు

ఎన్నికలకు ముందు, ఎన్నికలు కమీషన్, ఎన్నికల, నామినేషన్ల, పోలింగ్ మరియు కౌంటింగ్ ల తేదీలను ప్రకటిస్తుంది. అలాగే ఎన్నికల కోడ్ లనూ ప్రకటిస్తుంది. కేంద్రస్థాయిలో కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఎన్నికలను జరుపుటకు, సజావుగా సాగేందుకు కృషిచేస్తారు.

ఎన్నికల (పోలింగ్) రోజు

ఎన్నికల కేంద్రాలుగా, ప్రభుత్వ భవనాలను, పాఠశాలలను కళాశాల భవనాలను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామంలో, పట్టణాలలోనూ పాఠశాలలు ప్రజలకు అందుబాటులో వుంటాయి గనుక వీటిని పోలింగు కేంద్రాలుగా ఉపయోగిస్తారు. పోలింగు రోజున మద్యం  దుకాణాలను మూసివేస్తారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారు. ప్రజలందరూ ఎన్నికలలో పాల్గొను విధంగా ప్రజలకు పిలుపునిస్తారు.పోలింగు కొరకు, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. పోలింగు అయిన తరువాత, ఈ మెషిన్లను, అత్యంత జాగరూకతతో భద్రపరుస్తారు. పోలింగు రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా, పోలీసువారి సహాయ సహకారాలు వుంటాయి. నకిలీ ఓట్లు పోలవకుండా, బూత్ ఆక్రమణలు లాంటి చర్యలు జరుగకుండా చూస్తారు. ప్రజలందరూ ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకారాన్ని అందిస్తారు. పోలింగ్ బూత్లలో, పోలింగు సిబ్బందిగా ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను నియమించి, వారి సేవలను పొందుతారు.

ఎన్నికల (పోలింగ్) తరువాత

ఎన్నికలు అయిన తరువాత, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను, ప్రకటింపబడిన వోట్లలెక్కింపు రోజున తెరచి, వోట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడుతారు. దీనినీ ఎన్నికలు కమీషనే నిర్వహిస్తుంది. ఎవరెవరికి ఎన్ని వోట్లు వచ్చాయో ప్రకటిస్తుంది. అలాగే గెలిచినవారినీ ప్రకటిస్తుంది. గెలిచినవారి జాబితాను దేశవ్యాప్తంగా ప్రకటించి, ఆయా జాబితాలను, గవర్నరుకూ, రాష్ట్రపతికీ అందజేయబడుతాయి. ఆతరువాత కార్యక్రమాన్ని, రాష్ట్రపతి కేంద్రస్థాయిలోనూ, గవర్నరు రాష్ట్రస్థాయిలోనూ చేపడతారు.

జాగరూకత  వహించాల్సిన అంశాలు

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియా ద్వారా ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రచారం చేసినా, సమాచారం ఎవరికైనా పంపించిన కఠిన  చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్‌ హెచ్చరించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావటంతో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా  ఈ కోడ్‌ పరిధిలోకి వచ్చారు. ఉద్యోగులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే వారిపై వేటు వేసే అధికారం ఎన్నికల యంత్రాంగానికి ఉంటుంది. ఉద్యోగం నుండి  తొలగించే అవకాశమూ లేకపోలేదు. ప్రభుత్వ ఉద్యో గులతో పాటు వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా సెక్షన్‌ 23 (ఐ) ను అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం నిర్వహించకూడదనే నిబంధనలు అమల్లో ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తారని ఈసీ పేర్కొంటోంది. ప్రభుత్వ పథకాలు కూడా ఈ సమయంలో ప్రచారం చేయకూడదన్న ఆంక్షలు ఉండనే ఉన్నాయి.

ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా కీలక  పాత్ర పోషిస్తుంది. మునుపటి ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఇంటర్నెట్ వినియోగం పెరగడం ప్రజలకు తేలికగా దగ్గరయ్యే అవకాశం ఉండడంతో పోటీచేసే అభ్యర్థులు వారి అనుచరులు సోషల్‌ మీడియాను ప్రచారం ఎక్కువగా వినియోగిం చుకుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్‌ మీడియా విభాగాలను ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్‌, వాట్సాఫ్‌, ట్విటర్‌, మెసేంజర్‌ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తారు. అయితే ఈ సమయంలో సామజిక  మాధ్యమాలలో మరియు అటువంటి గ్రూపుల్లో వివాదాస్పదంగాను పౌరులను రెచ్చగొట్టే ప్రచారం, మతపర మైన సున్నిత అంశాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివాదాస్పద సంఘటనలు ఏదైనా జరిగితే వాటిని నిర్వహిస్తున్న గ్రూప్‌ అడ్మిన్‌ బాధ్యుడవుతారన్నారు. అందువల్ల సోషల్‌ మీడియాలో ఉద్యోగులు అనవసర వివాదాలకు, ప్రచారాలకు దూరంగా ఉంటే మంచిదని ఉద్యోగ సంఘ నాయకులు అంటున్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ వాట్సాప్‌ గ్రూపుల్లో ఎన్నికల నియమావళికి సంబంధించిన క్రమశిక్షణ చర్యల గురించి ఆయా వర్గాలు వేగంగా అవగాహనా కల్పిస్తున్నాయి.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని ఎన్నికల సంగం తెలిపింది.మీటింగ్‌లు, ర్యాలీలకు అనుమతులు తీసుకోవాలని, ఎక్కడైతే మీటింగ్, ర్యాలీకి పర్మిషన్ తీసుకుంటారో అక్కడే నిర్వహించాలని, స్థలం మార్చాల్సి వస్తే అధికారులకు తెలియజేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే లైజన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్‌కు తెలియజేయాలన్నారు. ఏవిధమైన వ్యక్తిగత విమర్శలనుగానీ, మత ప్రచారాలు చేయవద్దన్నారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు ఇచ్చిప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేయవద్దని అలా చేస్తే వారికే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికలలో పాల్గొని దేశ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే నాయకులని ఎన్నుకోవడం మాత్రమే కాదు  చేయడమే కాకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడికి ఉందని తెలియచేస్తూ....

 భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్లు పౌరుడికి హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలు కూడా అంతే ముఖ్యం అనే వ్యాఖ్యలు మరోసారి ఉటంకిస్తూ .....నవయువగళం