blog single post
editoryal

2019-02-23 09:51:43

సృజనాత్మక దర్శకుడు కోడిరామకృష్ణకు అంజలి ఘటిస్తూ....!

కోడి రామకృష్ణ అనే పేరు వినగానే మనకు తలకు ఒక బ్యాండ్ కట్టుకుని వైట్ అండ్ వైట్ తో చిరునవ్వు నవ్వుతూ మాట్లాడే వ్యక్తి గుర్తుకు వస్తారు. ఒక చిత్రం రూపొందాలీ అంటే అది కేవలం దర్శకత్వ ప్రతిభ తోనే ఎందుకు అనే ప్రశ్న వస్తే కథసమకూరి అది ప్రేక్షకుల ముందుకు అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కాలంటే దర్శకత్వ నిర్వహణ కీలకం. అటువంటిది అనతి కాలంలోనే కోడి రామకృష్ణ చేయగలిగారు.కె.రాఘవేంద్రరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు వంటి దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమలో వాణిజ్య కథాంశాలతో పరిశ్రమ స్తాయిని పెంచుతున్న తరుణంలోనే కోడి రామకృష్ణ కూడా ఆయనదైన బాణీ పలికించారు.అంకుశం,20వశతాబ్దం,భారత్ బంద్, శత్రువు, గూఢచారి నెం.1,మంగమ్మ గారి మనవడు, ముద్దులమామయ్య,మువ్వగోపాలుడు, ఆలయశిఖరం,దేవుళ్లు మరియు సాంకేతికంగా గ్రాఫిక్స్ లోకంలోకి తీసుకుని వెళ్లేలా రూపొందించిన అమ్మోరూ,అంజీ,దేవిపుత్రుడు,అరుంధతీ అత్యున్నతంగా నిలిచాయి.గ్రాఫిక్స్ వినియోగం తొలిదశలో ఉన్న రోజుల్లోనే తెలుగు తెరకు వాటిని ఇనుమడింప చేశారు. ఇటువంటి చిత్రాలను సైతం అత్యంత వేగంగా  రూపొందించే దర్శకుడిగా పేరు సంపాదించారు. కోడి రామకృష్ణ. కొత్తవాళ్లతోనూ, అగ్ర కథానాయకులతోనూ సినిమాలు చేసి విజయాల్ని అందుకొన్నారు. గురువు దాసరి నారాయణరావులాగే సమాజానికి అద్దం పట్టే కథలు, కుటుంబ కథల్ని రూపొందిస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన తీసిన చిత్రాల్లో ఎక్కువ శాతం విజయాలే. అర్జున్‌, భానుచందర్‌, సుమన్‌వంటి అగ్ర నటుల్ని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. బాబూమోహన్‌, కాస్ట్యూమ్‌ కృష్ణ, రామిరెడ్డి, ముక్కా నరసింగరావు ఆయన తీర్చిదిద్దిన నటులే. చివరిగా ఆయన కన్నడలో ‘నాగరహావు’ అనే చిత్రం చేశారు. అది కూడా కోడి రామకృష్ణ మార్క్‌ సాంకేతిక మాయాజాలంతో తెరకెక్కిన చిత్రమే. కథానాయకుడిగా ‘మా ఇంటికి రండి’ అనే చిత్రంలో కూడా నటించారు. కోడి రామకృష్ణ భార్య కోడి పద్మ కూడా నటిగా పేరు తెచ్చుకొన్నారు. లలిత కళాంజలి పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించి, పలు చిత్రాల్ని నిర్మించారు కోడి రామకృష్ణ.దర్శకత్వంలోనే కాకుండా... నటన పరంగా కూడా గురువు దాసరి నారాయణరావు గారి బాటలో పయనించారు. దాసరి తన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించేవారు. కోడి రామకృష్ణ కూడా ‘దొంగాట’, ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’, ‘అత్తగారూ స్వాగతం’, ‘ఇంటి దొంగ’, ‘మూడిళ్ల ముచ్చట’తోపాటు దాదాపుగా 20  చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి అలరించారు.అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం సంవత్సర కాలం పాటు ప్రదర్శింపబడింది.ఇది ఆయన మొదటి చిత్రం కావడం గమనార్హం. ఆయన ప్రేక్షకులకు అందించిన మరిన్ని చిత్రాలు మరోసారి మననం చేసుకుంటూ ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మదిలో ఎల్లప్పుడూ ఉంటాయి.ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించిన వినోదాల విందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.....!

 

                                                                                                                                                                                   

                                                                                                                                                                                          ............నవయువగళం