blog single post
editoryal

2018-12-20 07:46:50

కులమా లేక రాష్ట్రమా తేల్చుకో ఓ ఆంధ్రుడా!

ప్రియమైన ఆంధ్రులకు నమస్కారం. కులం అనే జాడ్యం తో ఎగిరెగిరిపడుతున్న సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. కమ్మ అంటే కొమ్ములున్నట్లు కాపు అంటే సూరులలా  రెడ్డి అంటే వీరులలా ఇలా అన్ని కులాల వాళ్ళు వాళ్ళని వాళ్ళ కులంని గొప్పగా ఊహించుకుంటూ కులపిచ్చితో రాష్ట్రము పరువు తీస్తున్నారు. కూడుపెట్టని కులానికి గూడు కట్టని కులానికి ప్రేమని పంచలేని కులానికి అసలు కులం అంటే ఏంటోకూడా తెలియకుండా కులానికి బానిసలు అవ్వడం నిజంగా బాధాకరం. ఊర్లలో పాచిపనులు చేసుకుంటున్నవాడి దగ్గర నుండి కార్పొరేట్ ఆఫీస్ లో మేనేజర్ వరకు కులానికి గులాములు అంటే ఆంధ్ర సమాజం ఎటుపోతుందో అర్ధం చేసుకోవచ్చు. తరాలు మారినా అంతరంగాలు మారినా టెక్నాలజీ కాలంలో కూడా మనల్ని అంటిపెట్టుకొని ఉన్నదీ ఒక కులం మాత్రమే. అందరూ మనుషులే అని మరచి అందరి శరీలాలలో పారేది రక్తమే అని మరచి ఒక్కోళ్ళకొక్కలు సాయం చేసుకోడమే నిజమయ్యిన మానవతావాదం అని మరచి కులం అనే వితండవాదాన్ని భుజానికెత్తుకొని తలకుమించిన భారాన్ని మోస్తున్న ఓ శ్రామికుడా నీకు ఏమిచ్చి ఆంధ్ర దేశం ఋణం తీర్చుకుంటది? కులం ముసుగులో హత్యలు చేస్తారు కులం ముసుగులో దోపిడీలు చేస్తారు కులం ముసుగులో నోటి దూలను తీర్చుకుంటారు కులం ముసుగులో గంజాయి మత్తులో ఉన్నట్లు ఊగిపోతారు. చివరకు మన కులం వాడని రాష్ట్రము ఎటుపోయిన పర్లేదు అని వాడికే ఓటు వేస్తారు.

విభజింపబడి ఆసరా లేక అనాధగా మిగిలిన ఆంధ్ర రాష్త్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలి అనే కసిపోయి కులం అనే దానికి బానిసలై అర్హత లేని నాయకులని నెత్తిన పెట్టుకొని తిరగడం సమంజసమా? ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరికన్నా ఓటు వేసుకోవచ్చు కానీ దానికి కులం ప్రాతిపదిక అయితే అంతకన్నా నీచమైన పని ఎమన్నా ఉందా? నీరు కావాలి కొలువులు కావాలి రోడ్లు కావలి విద్యుత్ కావాలి రైతు బాగుపడాలి రాజధాని కట్టాలి అన్ని వర్గాలకి మేలు చేసే నాయకుడి కావాలనుకోవాలి కానీ కులం కులం అని అరిస్తే రేపు మన కడుపు కాలుతున్నప్పుడు ఆదుకునే దిక్కు ఉండదు. కులాల మధ్య ద్వేషాలు పెంచుకుంటూ ఐక్యమత్యం ని నాశనం చేస్తున్నారు. కులాల కుంపట్లతో అభివృద్ధి నిరోధకుల వలె తయారవ్వడం దేనికి నిదర్శనం?

కులం నుండి పుట్టే నాయకత్వం విద్వేషాలు రెచ్చగొడితే జనం నుండి పుట్టే నాయకత్వం అభివృద్ధికి బీజాలు వేస్తుంది. దేనినైనా సాధించే సత్తా ఆంధ్ర జాతికి ఉంది. కానీ లేనిదీ ఒకటే ఐక్యమత్యం. ఆంధ్ర జాతి పౌరుషం అంటే ఆంధ్ర జాతి గర్వం అంటే ఆంధ్ర జాతి పట్టుదల అంటే ఆంధ్ర జాతి సూరత్వం అంటే కులాల కుమ్ములాటలా అని ఇతరులు నవ్వుకునే స్థితికి చేరుతున్నాం. మా ప్రజలు విడిగా ఎలా ఉన్నా అవసరం అయ్యినప్పుడు అన్ని వర్గాలు కలుస్తాయి కానీ ఆంధ్రాలో అలా కాదు జాతి అవసరాలు తాకట్టు పెట్టి అయ్యినా కుల రాజకీయాలు చేస్తారు అని అంటుంటే  ఆంధ్ర జాతికి సొంపుగా ఉంటుందా?

కులం కోసం రాష్ట్రాన్ని బలి చేద్దామా? కులం కోసం బావితరాలని బలిచేదామా? కులం కోసం విద్వేషాలు రెచ్చగొడదామా? కులం కోసం ఆత్మగౌరవం తాకట్టు పెడదామా? కులం కోసం అభివృద్ధిని అడ్డుకుందామా? కులం కోసం కడుపు నిండకపోయినా పస్తులుందామా?కులం కోసం రాబంధులను అందలం ఎక్కిదామా? ఆంధ్రుడి వైభోగమా లేక కుల వ్యసనమా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకటిగా ఉండి రాష్ట్రాన్ని అన్నిట్లో ఒకటో నంబర్లో నిలబెడదామా లేక కులాలుగా వర్గాలుగా చీలిపోయి చీకట్లు కురిపిదామా తేల్చుకోవాలి ప్రతి ఆంధ్రుడు.

అద్బుతమయ్యిన రాజధాని కట్టుకుంటున్నాం, కరువుని తరిమే పోలవరం చివరి దశలో ఉంది. నదులని అనుసంధానిస్తున్నాం, పేదలకు ఇల్లు  కడుతున్నాం పట్టెడు అన్నం పెడుతున్నాం, పింఛన్లతో భరోసా ఇస్తున్నాం, ప్రపంచం ఆంధ్ర వైపు చూస్తుంది అన్నిటిని వదిలేసి అన్నిటికి అడ్డుపడుతూ మన కంటినీ మనమే పొడుచుకుందామా? కులం కోసం మీరు వేసే ప్రతి అడుగు తెలుగు తల్లి గుండెల మీద తన్నినట్లు ఇది గుర్తుంచుకొని తెలుగు తల్లి గౌరవాన్ని కాపాడండి

తేల్చుకో ఆంధ్రుడా కులమా లేక రాష్ట్రమా?

జై ఆంధ్ర ప్రదేశ్

---ప్రసాద్