blog single post
editoryal

2018-11-14 14:49:22

“ తస్మాత్!జాగ్రత్త....!!!“

తెలంగాణాలో మహాకూటమి ప్రధాన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ వ్యవహార శైలిని గమనిస్తుంటే వందేళ్ల పైబడిన ఇంపైన చరిత్ర మాది అని చెప్పు కోవడమే గాని, అది ఎంత కంపైనదో గ్రహించుకుని, కాలానుగుణంగా మార్పులను సంతరించుకుందామన్న ఇంగిత జ్ఞానం ఉన్నట్లు అనిపించదు.కాంగ్రెస్ ఒక విష వృక్షం అన్న సద్విమర్శ వుంది.అంతే కాదు అది ఒక భయంకర విషపురుగు అని కూడా చెప్పుకోవచ్చు. ఎంత దెబ్బతిన్నా దాని సహజ లక్షణాలు మారవు. తాడిచెట్టు లోతు బోరు బావిలో పూడ్చి పెట్టి, పది సంవత్సరాల తరువాత బయటకు తీసినా దాని సహజలక్షణాలను అది కోల్పోదు. వెంటనే వళ్ళు విదిల్చుకుని తదుపరి కార్యాచరణ విషయమై అధిష్టానం నుండి దిశానిర్దేశం కోసం ఢిల్లీ కి ప్రయాణం కడుతుంది.
తెలంగాణలో పోటీ చేస్తున్న 94 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 90 మంది కన్ను ముఖ్య మంత్రి పీఠం పైనే. కూటమి గెలిచే వరకే ! ఆ తరువాత కూటమి విచ్ఛిన్నానికి అవిరళ కృషి జరిగేది కాంగ్రెస్ పక్షం నుండే. ఇప్పటికే కోమటిరెడ్డి, జానా రెడ్డి వగైరాల ప్రకటనలు చూస్తుంటే, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నది అర్ధం కావట్లా!.1983 లో తెలుగు దేశం ఆవిర్భావం తరువాత తెలంగాణా లో కాంగ్రెస్ కు ‘నాయకుల బ్యాంకు’ తప్ప, ‘ఓటు బ్యాంకు’ ఎక్కడ వుంది ? అయినా కాంగ్రెస్ మిగతా పక్షాల పట్ల తానేదో పెద్దన్న అనే మత్తులో కూరుకుపోయి, కూటమి స్ఫూర్తి దెబ్బతింటుందేమో నన్న ఇంగితం కొరవడి, మితి మీరిన అహంకార ధోరణి ప్రదర్శిస్తోంది. కూటమికి విజయం దక్కితే మట్టుకు, తెలుగు దేశం సహా మిగతా భాగస్వామ్య పక్షాలకు ముందు ముందు కష్టాలే. విషనాగు పడగ నీడన కాపురం చేసినట్టే ఉంటుంది వారి పరిస్థితి.
బ్రతికి చెడ్డ వాడు పాత వాసనలు మర్చి పోలేడు అన్న సామెత కు కాంగ్రెస్ కాంగ్రెస్, ఏమీ మినహాయింపు కాదు. అందుకే కూటమిలోని కాంగ్రెసేతర భాగస్వామ్య పక్షాలూ ‘తస్మాత్ జాగ్రత్త’ !!!
______________యలవర్తి శేఖర్