blog single post
editoryal

2018-10-16 13:35:41

"భయపెట్టి పబ్బం గడుపుకో"...! ఇదే బీజేపీ దేశానికి ఇచ్చిన సందేశం...!

ఎన్నో ఆశలు ఎన్నో ఊహలు దేశ భవిష్యత్తు మారుస్తాడు.. మా మచ్చ లేని నాయకుడు అని హోరెత్తిపోయిన రోజులు అవి. దేశం అంటే మోదీ...మోదీ అంటే దేశం అని ఊరేగిన రోజులవి. నిగనిగలాడిపోతున్నాడు, 56 అంగుళాల చాతి కలవాడు, ఉరుకులు పరుగులు పెడుతూ దేశాన్ని అభివృద్ధిలో పరిగెత్తిస్తాడు అని ఊదరగొట్టిన రోజులవి. అవినీతికి చరమగీతం నీతికి అందలం అని వాయించిన రోజులవి. అవినీతిపరులు ఇంకా ముసుగువేసుకొని దాక్కోవడమే అని డప్పు కొట్టిన రోజులవి. నవశకం, నవ భారతం ఇలా చెప్పుకుంటూ పోతే పొగడడానికి వాడే ప్రతి పదం మోదీని పలకరించాయి. నమో నమో అని మారుమోగిపోయింది. విదేశాల వాళ్ళు కూడా ఎంతో కుతూహలంగా ఎదురు చూసారు భారత దేశం లో ఎం జరగబోతుందో అని.
కాలం కరిగింది మబ్బులు వీడుతున్నాయి రంగులు బయటకివస్తున్నాయి చరిత్ర ఎరుగని కుట్రలు చరిత్ర మోయలేని ఇబంధులు, చరిత్రకు తెలియని ధన దాహం అధికార దాహం. రాజ్యాలని కబళిస్తూ భారత దేశం మీదకి దండయాత్రకు వచ్చిన విదేశీ రాజులా పేట్రేగిపోతున్న మహోన్నత వ్యక్తి మోది అని వినిపిస్తున్న మాటలు. ఇది నేడు జనం నుండి వస్తున్న మాట. ఎంత తేడా నాటికి నేటికీ. మహా మహా నియంతలు కాలగర్భం లో కలిసిపోయారే నాకు కూడా ఆ గతి పట్టదా అని స్పృహ లేకుండా తాను అనుకున్నది చేస్తున్న గొప్ప యోధుడి చేతిలో భరత మాత చిక్కుకొనిపోయి ఉంది.
ఒక్క ఓటు కొనడం ఇష్టం లేక ఆ ఒక్క ఓటు తోనే ప్రభుత్వం పడిపోతున్నా చలించని పిచ్చి రాజు అలనాటి వాజపేయి. ఉన్నది నాలుగు ఓట్లు అయ్యినా మిగిలిన ఓట్లు కొనేస్తూ  ప్రభుత్వం ఏర్పాటు చేయడం నేటి గొప్ప రాజు అయ్యిన మోదీ నైజం. ఏదైనా రాష్ట్రములో ఎన్నికలు వస్తుంటే ఆదాయపన్ను శాఖను మరియి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని పరిగెతించడం నేడు ఒక ధర్మం. విపక్షాలు డబ్బులు పంచడం ఏంటి పంచితే నేనే పంచాలి ఇదే నూతన రాజకీయ సూత్రం. టార్గెట్ ఫిక్స్ అయ్యింది మేము చెప్పింది వినకపోతే దండయాత్రే ఇది దయ గాడి దండయాత్ర అని ఏదో సినిమా లో డైలాగ్ లాగా మోది కి అయన అంతరంగికుడు అయ్యిన అమిత్ షా కి నిత్యకృత్యం అయ్యిపోయింది. ఇది రాజకీయాలలో మోదీ తెచ్చిన సరికొత్త విప్లవం.
అడ్డు వచ్చిన వాడిని ఏదో ఒక కేసు లో ఇరికించాలనుకోవడం అది కుదరకపోతే తప్పుడు కేసులలో ఇరికించడం ఒక వ్యాపకం లాగా పెట్టుకున్నారంటే పల్నాటి బ్రాహ్మ నాయుడు బాల నాగమ్మ కధ ఏ మూలకి వస్తది. అవినీతి పరుల భరతం, ఉగ్రవాదులకు నిధులు అందకుండాచేయడం అనే ముసుగులో తన వారి బ్లాక్ మనీ ని వైట్ చేయించడం మోదీ తెచ్చిన అతి పెద్ద సంస్కరణ. అంత గొప్ప నాయకుడి కోసం ప్రజలు ఆ మాత్రం భరించలేరా? మోది-షా ద్వయం చేస్తున్న గొప్ప పనులకి తీసుకొస్తున్న సంస్కరణలకు దేశ ప్రజలలో నానాటికి అభద్రతాభావం పెరిగిపోతుంది ఇది దేశానికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.
రైతన్నలు రోడ్డు ఎక్కుతున్నారు. రాష్ట్రాలు తమ వాటాలు తమకి రావడం లేదని గగ్గోలు పెడుతున్నాయి, నిరుద్యోగుల ఆశలు ఆవిరవుతున్నాయి, ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, రూపాయి పతనం అవుతుంది, ఉన్మాదులు రెచ్చిపోతున్నారు, రుణాలు ఎగ్గొటిన వీరులు విదేశాలకి పారిపోతున్నారు, విధివిధానాలు సరిగ్గా లేని జి.ఎస్.టి వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. సమస్యలు కోకొల్లలు అయ్యినా మనం ఎవర్ని టార్గెట్ చేస్తే మనకి ఉపయోగం ఎవర్ని తప్పిస్తే ఉపయోగం ఏ వర్గాన్ని రెచ్చగొడితే మనకి ఉపయోగం, బలంగా లేని రాష్ట్రము లో అల్లర్లు ఎలా చేపించాలి ఇవే సరిపోతున్నాయి మన వీరుడికి.
అవినీతిపరులకు ఉగ్రనరసింహం అని చెప్పి అవినీతికి చక్రవర్తిలా మారుతున్నావ్. నీ పెదవి మాట వేరు నీ హృదయపు మాట వేరు, నీ రెండు కళ్ల చూపు వేరు నీ మూడో కంటి చూపు వేరు, నీ పైకి కనపడే దర్పం వేరు దాని వెనక ఉండే చండాలం వేరు. నువ్వు చెప్పే విలువ వేరు దానికి నువ్వు వేసే సిలువ వేరు. నీ మాట అవినీతికి తూటా కాదు నీతికి తూటా. మనసున్న మా రాజువి కాదు మనిషిని మసి చేసే మంత్రానివి. రాష్ట్రాలకి చేయూతనిస్తే దేశం బాగుపడుతుంది అనే స్పృహని వదిలేసి నీ వోట్ లు నీ సీట్ లు కోసం బెదిరించి భయపెట్టి పబ్బం గడుపుకుందాం అనుకునే ఓ యోధుడా నీకు వందనం పాదాభివందనం.
చరిత్ర నిన్ను మరువదు చరిత్ర నిన్ను క్షమించదు ఒక నియంతలా ఒక క్రూరుడిగా మిగిలిపోతావ్...తస్మాత్...!జాగ్రత్త మేలుకో...!
________________________ప్రసాద్