blog single post
editoryal

2018-08-28 05:21:20

నాది దళారులు లేని ప్రభుత్వం - ప్రధాని మోడీ

మోడీ గారిది దళారులు లేని ప్రభుత్వమట. అవునుమరి !!! అందుకేగా ఆయన ఒంటరిగా ఫ్రాన్స్ వెళ్లి, అధునాతన ఆయుధ ప్రయోగాలకు కావాల్సిన అన్ని అమరికలతో కలిపి  ఒక్కో విమానం రూ.526 కోట్లకు యు పి ఏ ప్రభుత్వ హయాం లో కుదిరిన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు పర్చి,  ఫ్రాన్స్ వాళ్ళు ఇంతకు ముందే ఇస్తామన్న అధునాతన ఆయుధ ప్రయోగ అమరికలను మరోమారు అడిగి  ఆయా అమరికలకు గాను, ముందుగా కుదుర్చుకున్న రూ.526 కోట్లకు అదనంగా ఒక్కో విమానానికి రూ.1144  కోట్లు చొప్పున మొత్తం రూ. 1670 కోట్లు ఇస్తామని పునః ఒప్పందం కుదుర్చుకొచ్చాడు.  ఇందులో భారీ కుంభకోణం ఇమిడి ఉందనీ, దానికి సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గత పరచాలని బిజేపీ కే చెందిన కొంత మంది సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన అలా పునః  ఒప్పందం చేసుకునే సందర్భానికి ముందే, నిబద్దత కలిగిన రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ ని, ముఖ్య మంత్రిగా గోవా రాష్ట్రానికి పంపించారని, పోనీ ఫ్రాన్స్ వెళ్లేప్పుడైనా, ప్రధాని  రక్షణ శాఖ ఉన్నతాధికారులను గాని, సాంకేతిక విషయం పరిజ్ఞానం వున్న వాయుసేన అధికారులను గాని తన వెంట తీసుకు వెళ్లకుండా భారీ మార్పులతో కూడిన ఇంత పెద్ద ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు అన్నది విమర్శకుల ప్రశ్న.  
"లోగుట్టు పెరుమాళ్ళ కెరుక " అన్న సామెతను గుర్తు చేసుకుని, దానికి మరో సామెత...."కాగల కార్యం గంధర్వులే పూర్తి చేస్తారు" అన్నదాన్ని జత చేసి ఈ విషయం ప్రస్తుతానికి ఇక్కడ వదిలేద్దాం. అన్నట్టు....గంధర్వులంటే ఎదో స్వర్గలోకం నుండి  వస్తారని, వాళ్ళే ఏవో వండర్స్ చేసి సమస్యను పరిష్కరిస్తారనుకోకండి. ఇక్కడ గంధర్వులంటే ... ప్రజలే.  2019 ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధం ప్రయోగించి ఇలాంటి చెత్త సమస్య లను చాలా ఈజీ గా పరిష్కరిస్తారు. లెట్ అజ్ వెయిట్.
కొసమెరుపు : మరీ 526 కోట్ల విమానానికి అదనపు పరికరాలు అమర్చడానికి 1144 కొట్లంటే వినడానికి ఎవరికైనా ఎబ్బెట్టుగానూ ఉంటుంది, అనుమానాస్పదంగానూ ఉంటుంది. పాపం మోడీ గారు మరో విధంగా అలోచించి, 1144 కోట్ల పరికరాలకు 526 కోట్ల విమానాన్ని జత చేయించి,  ఉంటే తేడా బాగా తక్కువగా ఉండేది గదూ !!!
  ____________యలవర్తి శేఖర్